- అక్కాచెల్లెళ్ల మార్ఫింగ్ ఫొటోలతో సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిల్
- హర్యానాలో సోదరుడి సూసైడ్
చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి(19)కి అతని అక్కాచెల్లెళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో ఏంచేయాలో తోచక యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదాబాద్‌కు చెందిన రాహుల్ భారతి అనే యువకుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆపై రాహుల్ తోపాటు అతని ముగ్గురు తోబుట్టువుల ఏఐ జనరేటెడ్ న్యూడ్ ఫొటోలను, వీడియోలను క్రియేట్ చేశారు. వాటిని రెండు వారాల క్రితం రాహుల్ కే పంపించారు. ఆ మార్ఫింగ్ ఫొటోలను, వీడియోలను చూసిన రాహుల్ షాక్‌కు గురయ్యాడు.
అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు అతడికి కాల్ చేసి..రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు విషం తాగేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రాహుల్ ఫోన్ ను పరిశీలించారు. అతని వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా సైబర్ నేరగాళ్ల బెదిరింపుల వల్లే రాహుల్ భారతి సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. సాహిల్ అనే వ్యక్తి రాహుల్‌ను బెదిరించినట్లు మెసేజులు గుర్తించామన్నారు. అందులో నిందితుడు మృతుడి తోబుట్టువుల అశ్లీల ఫొటోలను పంపి.. డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా అతడే రాహుల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు చెప్పారు. నీరజ్ భారతి అనే మరో వ్యక్తికి ఈ కేసులో ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ కు ముందు నీరజ్ భారతితో రాహుల్ మాట్లాడినట్లు గుర్తించామన్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు.
