
ఉపసర్పంచిపై మృతుడి భార్య ఫిర్యాదు
దుబ్బాక, వెలుగు: తనపై దొంగతనం నేరం మోపారని మనస్తాపానికి గురైన ఓ రైతుఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో చోటుచేసుకుంది. ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనం చేశాడని, కేసు పెడతానని పెద్దమాస్ పల్లి ఉపసర్పంచి బెదిరించడంతో రైతు తాళ్ల యాదగిరి(38) పురుగులమందు తాగాడని పోలీసులు తెలిపారు. జనవరి 27న తన భార్య బాలవ్వతో కలిసి హైదరాబాద్కు వెళ్లిన యాదగిరిని భూమి దున్నడానికి రమ్మని రాజిరెడ్డి ఫోన్ చేసి పిలిపించాడు.
ఆ తర్వాతి రోజు యాదగిరి వ్యక్తిగత పనులమీద సిద్దిపేటకు వెళ్తుండగా ఎన్సాన్పల్లి వద్ద ఆపి.. ట్రాక్టర్ బ్యాటరీ దొంగిలించి అమ్ముకున్నావని, కేసు పెడతానంటూ ఉపసర్పంచ్ బెదిరించడంతో మనస్తాపానికి గురైన యాదగిరి జనవరి 31న గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. బాలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేశారు.