రైతు డిస్కమ్లో చేరే ఉద్యోగులకు పదోన్నతులు!

రైతు డిస్కమ్లో చేరే ఉద్యోగులకు పదోన్నతులు!
  • ట్రాన్స్​కో, జెన్​కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్ ల ​ఉద్యోగులకు అవకాశం
  • నేటి నుంచి 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 13న అపాయింట్​మెంట్​     లెటర్ల జారీ
  • 25 నాటికి జాయినింగ్​కు అవకాశం
  • గైడ్​ లైన్స్​ జారీ చేసిన సీఎండీ ముషారఫ్​ అలీ ఫారుఖీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్​లో చేరే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్టు గురువారం ఆ సంస్థ సీఎండీ ముషారఫ్​ అలీ ఫారుఖీ తెలిపారు. ట్రాన్స్​కో, జెన్​కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్​ లలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు దరఖాస్తు చేసుకునేందుకు గైడ్​ లైన్స్​ ఇచ్చారు. శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 13న అర్హులకు అపాయింట్​మెంట్​ లెటర్లు ఇస్తామని తెలిపారు. రిపోర్టింగ్​ కు 3 రోజులు గడువు ఇస్తామని, 19న పోస్టింగ్​ ఆర్డర్స్​ జారీ చేస్తామని పేర్కొన్నారు. 25 వరకు విధుల్లో చేరడానికి గడువు ఉంటుందని ప్రకటించారు. 

ఎస్ఈ నుంచి సీఈ.. డీఈ నుంచి ఎస్ఈకి పదోన్నతి

రైతు డిస్కమ్​లో పనిచేయడానికి ఒక ఏడాది అనుభవం ఉన్న ఎస్ఈకి సీఈ​గా, రెండేండ్ల అనుభవం ఉన్న డీఈకి ఎస్ఈగా పదోన్నతి కల్పించి విధుల్లోకి తీసుకుంటామని సీఎండీ తెలిపారు. ఏడీఈకి డీఈగా, ఏఈ, అడిషనల్​ ఏఈలకు ఏడీఈలుగా, సబ్​ఇంజినీర్లకు ఏఈ, అడిషనల్​ ఏఈలుగా, అర్హత కలిగిన ఫోర్​మేన్లకు సబ్​ ఇంజినీర్లుగా ప్రమోషన్​ ఇస్తామని చెప్పారు. సివిల్​విభాగంలో అనుభవం కలిగిన ఈఈలకు ఎస్ఈలుగా, ఏఈఈలకు ఈఈలుగా, ఏఈలకు ఏఈఈలుగా పదోన్నతి కల్పిస్తామన్నారు.

అలాగే, అకౌంట్స్​విభాగంలో జనరల్​ మేనేజర్లకు చీఫ్​ జనరల్​మేనేజర్లుగా, సీనియర్​ అకౌంట్స్​ఆఫీసర్లకు జనరల్​ మేనేజర్లుగా, అకౌంట్స్​ ఆఫీసర్లకు సీనియర్​ అకౌంట్స్​ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇస్తామని అన్నారు. వీరితో పాటు ఆపరేషన్​ అండ్​ మేయింటనెన్స్​ విభాగంలో కూడా పదోన్నతులు ఉంటాయన్నారు. గ్రేడ్​ 1, 2, 3, 4 క్యాడర్​ ఆర్టిజన్లకు ఒక అడిషనల్​ ఇక్రిమెంట్​ఇస్తామన్నారు. అది కూడా తొలిదశలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రమోషన్లు ఇస్తామన్నారు. ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ నియమాలు వర్తింపజేస్తామని చెప్పారు. 

ఏసీబీ, క్రిమినల్​ కేసులున్న వారికి అర్హత లేదు

రైతు డిస్కమ్​లో చేరడానికి అప్లయ్​ చేసుకునే ఉద్యోగులు ఏసీబీ, ఇతర క్రిమినల్, డిసిప్లినరీ కేసులలో ఇన్​వాల్వ్​ అయి ఉండకూదని సీఎండీ తెలిపారు. ఈ విషయమై దరఖాస్తు చేసుకునే ఉద్యోగి తప్పనిసరిగా తనపై ఎలాంటి క్రిమినల్, ఇతర కేసులు లేవని స్వయంగా రాసి ఇవ్వాలన్నారు. బదిలీ ద్వారా పదోన్నతులు పొందిన వారు కనీసం ఐదేండ్ల పాటు రైతు డిస్కమ్​లో పనిచేయవలసి ఉంటుందన్నారు. వీరికి ఐదేండ్ల దాకా స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం, ఇతర సంస్థలకు డిప్యూటేషన్​పై వెళ్లే చాన్స్ ఉండదని తెలిపారు.

దరఖాస్తు ఆన్‌‌‌‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపించాలన్నారు. దరఖాస్తు చేసిన వారిలో ఎవరిని సెలక్ట్​ చేసుకోలి.. సెలక్ట్​ అయిన వారికి క్యాడర్​ను బట్టి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి.. అనే అధికారం రైతు డిస్కం యాజమాన్యానికే ఉంటుందన్నారు. జీతం, సర్వీస్​ నిబంధనలు, ఈపీఎఫ్, జీపీఎఫ్​ మాతృసంస్థలో మాదిరిగానే ఉంటాయని వివరించారు.