
- కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్
- ఆర్డర్లు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు
- కేంద్రం ట్రేడ్ పాలసీతో ఆయిల్ పామ్ గెలల రేట్లు డౌన్
- తీవ్రంగా నష్టపోతున్న ఆయిల్ పామ్, పత్తి రైతులు
- విదేశీ పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడం అన్యాయం: మంత్రి తుమ్మల
- ప్రత్యామ్నాయ చర్యలతో రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కొత్త ట్రేడ్ పాలసీలు ఆయిల్ పామ్, పత్తి రైతులకు శాపంగా మారుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వాణిజ్య పంటలపై దిగుమతి సుంకాల తగ్గింపు, పన్ను మినహాయింపుల వల్ల దేశీయ మార్కెట్లలో వాటి డిమాండ్ తగ్గిపోతున్నది. దీంతో ఆర్డర్లు లేక వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. ఫలితంగా పామ్ ఆయిల్, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.70 లక్షలకుపైగా ఎకరాల్లో 73,744 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయ ఆయిల్పామ్గెలల ధరలు భారీగా పడిపోయాయి. ఫలితంగా రైతులు పొందే గెలల ధర టన్నుకు రూ.20 వేలకు చేరుకుంది. విదేశీ ఆయిల్ పామ్ గెలలు అగ్గువకు దొరకడంతో మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులు మాత్రమే లాభాలు ఆర్జిస్తున్నారు. రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
టారిఫ్ మినహాయింపుతో పత్తి రైతుకు కష్టాలు
కాటన్ దిగుమతులపై సుంకం మినహాయింపు కారణం గా దేశీయంగా పత్తి ధరలు మరింతగా పడిపోతున్నాయి. గతంలో 11 శాతం సుంకం ఉండగా, కేంద్రం దాన్ని ఎత్తివేసి డిసెంబరు 31వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వస్త్ర తయారీ పరిశ్రమలు అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చైనాలాంటి దేశాల నుంచి అగ్గువ ధరకు నాణ్యమైన పత్తిని దిగుమతి చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో పండిన పత్తి బహిరంగ మార్కెట్లలోనే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే రూ.1500 వరకు తక్కువ పలుకుతున్నది. రాష్ట్రంలో పండే పత్తిలో దాదాపు 60 శాతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), 40 శాతం వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈసారి ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. నిరుడు ఇదే సమయానికి భారీ విక్రయాలు జరిగినా, ఈ ఏడాది లక్ష టన్నులు కూడా కొనుగోలు జరగలేదు.
భారీ వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతిని, తేమ ఎక్కువగా ఉండటంతో సీసీఐ నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోళ్లు ఏటా 50 నుంచి -60 శాతం వరకు మాత్రమే జరుగుతున్నాయి. ఈ నెల 20 తర్వాత నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టనుంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో 30 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది.
కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్న రైతులు
తమకు నష్టం కలిగిస్తున్న కేంద్ర విధానాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశీ ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలని, కనీస గ్యారెంటీ గెలల ధరను టన్నుకు రూ.25 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరుతున్నారు. పత్తి విషయంలోనూ విదేశీ దిగుమతులపై సుంకం విధించాలని, జిన్నింగ్ మిల్లులు మూతపడకుండా సమగ్ర విధానం తేవాలని కాటన్ మిల్లర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
రాష్ట్ర రైతులకు నష్టం
ప్రపంచంలోని అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో మన దేశం ఒకటి. అయినా విదేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకం ఎత్తివేయడం అంటే రైతులకు తీరని అన్యా యం చేయడమే. అమెరికా ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కొనుగోళ్లు జరగడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ ద్వారా కోరాం.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లెటర్ రాశా. ఆయిల్ పామ్‌కు కనీస గ్యారంటీ ధర రూ.25 వేలుగా నిర్ణయించాలని, క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. -
తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి