V6 News

రైతులకు అవగాహన కార్యక్రమం..ఏప్రిల్ 27  నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

రైతులకు అవగాహన కార్యక్రమం..ఏప్రిల్ 27  నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
  • 200 బృందాలతో మే 23 వరకు కార్యక్రమం
  • వారానికి 400 గ్రామాల్లో సమావేశాలు: మంత్రి తుమ్మల

రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రికల్చర్​ కోర్సుల స్టూడెంట్లు మొత్తం 200 బృందాలుగా ఏర్పడి, వారానికి 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమవుతారని మంత్రి తుమ్మల తెలిపారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అగ్రికల్చర్​వర్సిటీ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యార్థులు మొత్తం 200 బృందాలుగా ఏర్పడి, వారానికి 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమవుతారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

యూరియా వినియోగం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, సాగునీటి ఆదా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై దాదాపు 2.45 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, మిల్లర్లతో చర్చల అనంతరం రాష్ట్రానికి అనువైన అధిక దిగుబడి ఇచ్చే 8 సన్న రకాలైన బీపీటీ  5204, తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్ 15048), కేఎన్ఎం 1638, జైశ్రీరాం, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్​962, డబ్ల్యూజీఎల్ 44, టీజీసీ 1798ని గుర్తించామన్నారు. ఈ విత్తనాలను వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, పంట మార్పిడి ద్వారా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలన్నారు. ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ పంటలు సాగు చేయాలని సూచించారు.