విత్తనాలు, మొక్కలపై జన్యు మార్పిడిని నిషేధించాలి :  రైతులు

విత్తనాలు, మొక్కలపై జన్యు మార్పిడిని నిషేధించాలి :  రైతులు

ఆమనగల్లు, వెలుగు: విత్తనాలు, మొక్కల జాతులపై జన్యు మార్పిడిని పూర్తిగా నిషేధించాలని రైతులు, విత్తన సంరక్షకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అన్మాస్​పల్లిలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ ఉమ్మడి ప్రకటన–2026’ను విడుదల చేశారు.

వారసత్వ విత్తనాలు, మొక్కల రకాలపై స్థానికుల సహజ హక్కులను పరిరక్షించాలని, డిజిటల్ సీక్వెన్స్ సమాచారాన్ని ఉపయోగించి బయో పైరసీని అడ్డుకోవాలని కోరారు. జన్యు మార్పిడి విత్తనాల వల్ల స్థానిక విత్తనాలు కలుషితమైతే సంబంధిత కార్పొరేట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. వాణిజ్య పంటల కంటే పోషక విలువలున్న స్థానిక ఆహార పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతి వ్యవసాయానికి మద్దతు అందించాలని పేర్కొన్నారు. విత్తనాలపై ప్రజల హక్కులను పరిమితం చేసే యూపీఓవీ సభ్యత్వం, విత్తన చట్టాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లను నిరోధించాలని డిమాండ్ చేశారు.

పేటెంట్ల తిరస్కరణ..

స్థానికంగా నిర్వహిస్తున్న విత్తన బ్యాంకులను ప్రోత్సహించాలని, ఐక్యరాజ్య సమితి రైతు హక్కుల ప్రకటనకు అనుగుణంగా జాతీయ చట్టాలు రూపొందించాలని విత్తన సంరక్షకులు కోరారు. భారతీయ జీవ వైవిధ్యం, జన్యు సంపదపై పేటెంట్లను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. స్థానిక విత్తన, జీవావరణ పద్ధతుల ద్వారానే జీవ వైవిధ్యానికి రక్షణ ఉంటుందని, వాటి పునరుజ్జీవనానికి మద్దతు కొనసాగిస్తామని రైతులు, పర్యావరణవేత్తలు, మహిళా సంఘాలు ఏకాభిప్రాయంగా ప్రకటించాయి.