ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ ముందు రైతుల ఆందోళన

ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ ముందు రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేపట్టారు. చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలన్న డిమాండ్ తో ప్రతినెల 22న ఒక్కో గ్రామం నుంచి బయలుదేరి ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు కోరుట్ల కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు.

ఈ క్రమంలో మే 22వ తేదీ సోమవారం చేపట్టిన పాదయాత్రకు చెరుకు రైతులు భారీగా హాజరైయ్యారు. ముత్యంపేట గ్రామపంచాయతీ నుంచి ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసి అనంతరం గేటు ముందు ధర్నా దిగారు. ఫ్యాక్టరీ ఎదుట బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఫ్యాక్టరీ ముందు బైటాయించి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

అనందరం మీడియాతో మాట్లాడిన జువ్వాడి కృష్ణారావు.. తెలంగాణ వచ్చాక వంద రోజుల్లో ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిన మాజీ ఎంపీ కవిత రైతులను మోసం చేశారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరవకుంటే ఫ్యాక్టరీ కేబుల్ కు ఉరి వేసుకుంటానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పత్తాలేకుండా పోయారని ధ్వజమెత్తారు. సొంత డబ్బులతో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ కూడా మాటతప్పారని కృష్ణారావు వెల్లడించారు.

ఫ్యాక్టరీ మూసివేతతో 8 ఏళ్లుగా చెరుకు రైతులు, అందులో పని చేస్తున్న వర్కర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ తెరిపించేంతవరకు ప్రతి నెల ఒక్కో  గ్రామం నుంచి పాదయాత్రలు చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు జువ్వాడి కృష్ణారావు.