
ఆదిలాబాద్: రైతులంటే నాగలి చేతపట్టి దుక్కి దున్నడమే కాదు.. బ్యాట్ పట్టి క్రికెట్ కూడా ఆడగలమని ప్రూవ్ చేశారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు. బోథ్ లోని లాల్ పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా కలిసి జట్టుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం ఎస్ ఎస్ టీంతో తలపడ్డారు. ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో రైతుల జట్టు ఓడిపోయింది. కానీ రైతులు ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. యువకులు షూస్, యూనిఫాంతో టోర్నీ ఆడగా.. రైతులు మాత్రం పంచెకట్టు, కాళ్లకు చెప్పులు లేకుండా మ్యాచ్ ఆడారు.
హిందు సాంప్రదాయాన్ని మరిచిపోతున్న వారికి కనువిప్పు కలిగిలే పంచకట్టుతో బరిలో దిగామంటున్నారు రైతులు. తాము దేంట్లో తక్కువ కాదనే భావనతో క్రికెట్ ఆడామని చెబుతున్నారు. రైతులని చులకనగా చూడకుండా..మేంకూడా క్రికెట్ ఆడిచూపించగలమని కలిసికట్టుగా ముందుకొచ్చామన్నారు. ఏనాడు బ్యాట్ పట్టని మేం ఓడినా గర్వంగానే ఉందన్నారు. ఇకముందు జరిగే టోర్నీలో గెలిచి సత్తా చాటుతామని రైతులు చెప్పుకొచ్చారు.