బషీర్బాగ్, వెలుగు: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం గ్రామ రైతులు శనివారం లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ భూములను నిఖిల్ రెడ్డి, రామ్ నాయక్, మనోజ్ అనే వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు. మార్టిగేజ్ పేరుతో చెల్లని చెక్కులు ఇచ్చి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు.
నిందితులు డీజీపీ బంధువులే కావడంతో వికారాబాద్ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కుల్కచర్ల ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, తమ భూములను తిరిగి తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశారు.
