పంటనష్టం కింద రైతులకు ఎకరానికి రూ.50వేలు ఇయ్యాలె : ఎంపీ అర్వింద్

పంటనష్టం కింద రైతులకు ఎకరానికి రూ.50వేలు ఇయ్యాలె : ఎంపీ అర్వింద్

రైతులకు పంట నష్టం పరిహారంపై ఇంతకుమునుపు చాలా సార్లు లేఖలు రాశామని, ఈ సారి కూడా రాశామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. కానీ ఆ లేఖలపై సీఎం కేసీఆర్ ఎప్పుడూ స్పందించలేదని, ఈ సారి మాత్రం స్పందించారన్నారు. ఎకరానికి రూ.10వేలు ఇస్తామన్నారని, కానీ తాము మాత్రం రూ.50వేలు డిమాండ్ చేస్తు్న్నామని తెలిపారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన పంట నష్టాలకు ఎప్పుడూ పరిహారం ఇవ్వలేదని అర్వింద్ అన్నారు. తామేదో గుడ్డిగా డిమాండ్ చేయడం లేదని, తమ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టే అడుగుతున్నామని చెప్పారు. అందులో మధ్యప్రదేశ్ రూ.32వేలు, మహారాష్ట్ర రూ.9వేలు, హర్యానా రూ.9 నుంచి 10వేలు ఇస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక్కడ ప్రీమియంలు కట్టకపోవడంతో ఫసల్ భీమా యోజన ఆగిపోయిందని, కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం మాత్రం అలాగే ప్రవర్తిస్తోందని అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతాంగం అతలాకుతలం అవుతున్నా, వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో పాలన కరువైందని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార పార్టీ లీడర్లు డ్యాన్సులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతాంగం అంతా మునిగిపోతుంటే వీళ్లు మాత్రం ఫామ్ హౌస్ లు చూసుకుంటున్నారని చెప్పారు. సీఎంకు తగ్గట్టు వ్యవసాయ శాఖ మంత్రి దొరికారన్న ఆయన.. ఆ మంత్రికి సీఎం కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉందంట కదా అని ప్రశ్నించారు. యథా రాజ కేసీఆర్ తథా నిరంజన్ అంటూ ఎంపీ కామెంట్స్ చేశారు. 

ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న క్యాప్షన్ పెట్టుకోవడానికి కనీసం అర్హత అయినా బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని అర్వింద్ నిలదీశారు. యార్డుల్లో సౌకర్యాలు లేవని, సమయాన్ని కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అత్యధిక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. కనీసం డిజాస్టర్ నిధులు ఇవ్వడం లేదని, అందులో 75శాతం కేంద్రం ఇచ్చిన ఫండ్సేనని తెలిపారు. 28రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ చేతగాని, అసమర్థ, సోమరిపోతు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు. ఆయన ముఖ్యమంత్రిగా సాగడానికి అనర్హుడని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.