- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అధికారిక ప్రకటన చేయాలి
- కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సమావేశంలో నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేసి.. ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతుల గుర్తింపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం అమల్లోకి వచ్చిందని నేతలు గుర్తు చేశారు. దీని ప్రకారం తెలంగాణలో 2015, 2016లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని.. 2017 నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం భూయాజమాన్య హక్కుల ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని, దీంతో కౌలు రైతులకు పెట్టుబడి సాయం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు.
22 లక్షల కుటుంబాలు కౌలు సాగుపైనే..
రాష్ట్రంలోని రైతుల్లో 36 శాతానికిపైగా కౌలు రైతులే ఉన్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. దాదాపు 22 లక్షల కుటుంబాలు కౌలు సాగుపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. సంక్షోభంలో ఉన్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి, సీపీఐ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం నేత జాన్ వెస్లీ, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్, సీపీఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) నేత జేవీ చలపతిరావు, సీపీఐ(ఎంఎల్-మాస్‌లైన్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జి. రంజిత్‌కుమార్, కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
