- రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉదారత
- యాచారంలోని 2 వేల గజాల స్థలం గిఫ్ట్ డీడ్
ఇబ్రహీంపట్నం, వెలుగు: రైతుల అవసరాల కోసం రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తన భూమిని ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేశారు. గురువారం రూ.4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు అప్పగిస్తూ.. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను తన కుటుంబం సభ్యులైన నర్సింహ్మారెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల క్రితమే యాచారం గ్రామంలోని రూ.4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిస్తున్నట్లు ప్రకటించానని తెలిపారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తులను నిల్వ చేసేందుకు, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోడానికి ఈ స్థలం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి ఈ విషయం వివరించానన్నారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారన్నారు. రూ.4 కోట్ల విలువ గల భూమిని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ పేరు మీద విరాళంగా ఇవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
