
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం (మే 21) హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన డీసీఎం, కారు ఢీకొన్నాయి. పసుమాముల నుండి కుంట్లూర్ వెళ్తున్న డీసీఎం ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం తో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో కుంట్లూర్ గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డి లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండటం తో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం (మే 20) రాత్రి పెద్ద అంబర్ పేట్ లో ఓ ఫంక్షన్ కు వెళ్ళిన మృతులు.. రాత్రి నారపల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. ఉదయం తమ గ్రామం కుంట్లూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంతో కుంట్లూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ముగ్గురు వ్యక్తులు వాళ్ల కుటుంబం లో ఒక్కొక్క కొడుకులే కావడం తో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపం లో ఉన్న పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.