
హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి, వెలుగు: ఫతేనగర్ వంతెన మెట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన వంతెన మెట్లపై నుంచి దిగుతుండగా పెచ్చులూడి పడి సోమవారం ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ ఈ మెట్ల మార్గాన్ని పరిశీలించారు. ప్రతి ఆదివారం సనత్నగర్లో సంత జరుగుతుందని, ఆ సమయంలో వందలాది మంది మెట్ల మార్గాన్ని వినియోగిస్తారని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో శిథిలావస్థకు చేరుకున్న మెట్ల నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదమని, వంతెనకు ఆనుకుని ఉన్న మెట్లను వెంటనే పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అలాగే సిటీలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాల విషయంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిపుణులతో తనిఖీ చేయించి ప్రమాదకరంగా మారక ముందే వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. కమిషనర్ ఆదేశాలతో ఫతేనగర్ వంతెనకు ఆనుకుని నిర్మించిన మెట్ల మార్గాన్ని జేసీబీతో హైడ్రా డిజాస్టర్ సిబ్బంది తొలగించారు. కొత్తగా అక్కడ మెట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఫతేనగర్ కార్పొరేటర్ సతీశ్ గౌడ్ తెలిపారు.