- హైదరాబాద్లోని అల్వాల్లో దారుణం
- వర్షానికి చెట్టు కూలడంతో కారుపై తెగిపడిన విద్యుత్ తీగలు
- వైర్లను తీసేస్తుండగా షాక్కు గురైన భార్య
- కాపాడేందుకు ప్రయత్నించి తండ్రితో పాటు కూతురు మృతి
అల్వాల్, వెలుగు: వర్షానికి చెట్టు కూలీ కరెంటు తీగలు తెగిపడడంతో షాక్కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్వాల్ ఎంఈఎస్ కాలనీకి చెందిన సందీప్(44) టెలికాం కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆయనకు భార్య శ్వేత, ఇంటర్ చదువుతున్న కూతురు ప్రీతిక(16) ఉన్నారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సందీప్ ఇంటి ముందు ఒక చెట్టు కూలిపోయింది. చెట్టు ప్లాస్టిక్ ఇన్సులేషన్ కలిగిన ప్రభుత్వ విద్యుత్ తీగలపై పడడంతో అవి తెగి అతని కారుపై పడ్డాయి. ఉదయం సందీప్ కారు తీయబోతుంటే.. శ్వేత, ప్రీతిక కూలిన చెట్టును దూరంగా జరపడానికి ప్రయత్నించారు.
అక్కడ వేలాడుతున్న ఒక విద్యుత్ తీగను గమనించి దానిని కారుకు దూరంగా జరపడానికి శ్వేత ప్రయత్నించారు. ఆమెకు షాక్ తగిలి కింద పడిపోయింది. గమనించిన సందీప్ వెంటనే దిగుతుండగా మరొక విద్యుత్ తీగ ప్రీతికపై పడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. సందీప్ ఆమెను రక్షించడానికి ప్రయ త్నించగా ఆయన కూడా కరెంట్ షాక్కు గురై కింద పడిపోయారు. స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి తండ్రి, కూతురును ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప షాక్కు గురైన శ్వేత కొంత సేపటికి లేచారు. తండ్రి, కూతురు మృతి కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణం: మృతుడి భార్య
ఈ విషాద ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విద్యుత్ లైన్ల సమస్యల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిర్వహణ చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన విద్యుత్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
