పదేండ్ల కిందట దూరమైన తండ్రీ కొడుకులను.. అన్నదాన కార్యక్రమం కలిపింది

పదేండ్ల కిందట దూరమైన తండ్రీ కొడుకులను.. అన్నదాన కార్యక్రమం కలిపింది

రాంచీ: పేదల కడుపు నింపేందుకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం పదేళ్ల కిందట దూరమైన తండ్రీకొడుకులను కలిపింది. తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడంతో తండ్రి జైలుపాలుకాగా.. వాళ్ల మూడేండ్ల కొడుకును ఓ ఎన్జీవో చేరదీసింది. ప్రస్తుతం బాలుడి వయసు 13 ఏండ్లు. ఇటీవల సంస్థ చేపట్టిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో భాగంగా పేదలకు భోజనం వడ్డిస్తున్న కొడుకు.. పంక్తిలో కూర్చున్న తన తండ్రిని గుర్తుపట్టాడు. తండ్రి కూడా కొడుకును గుర్తుపట్టి గట్టిగా కౌగిలించుకుని భోరున ఏడ్చాడు.

ఈ ఘటన జార్ఖండ్‌‌లోని రామ్‌‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్‌‌గఢ్ సిటీలోని వికాస్ నగర్ కు చెందిన టింకూ వర్మకు భార్య, శివమ్‌‌ అనే మూడేండ్ల కొడుకు ఉన్నాడు. 2013లో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో టింకూ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. పసివాడిని 'డివైన్ ఓంకార్ మిషన్' ఎన్జీవోకు అప్పగించారు. శివమ్‌‌  సంస్థలో చేరి పదేండ్లు గడిచిపోయాయి. అతను ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. డివైన్ ఓంకార్ మిషన్ నిర్వహించే అన్ని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే శివమ్‌‌.. శుక్రవారం కూడా రామ్‌‌గఢ్ జిల్లాలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

అక్కడ పేదలకు భోజనం వడ్డిస్తుండగా.. క్యూలో గడ్డంతో ఉన్న టింకూ వర్మను చూసి షాక్ అయ్యాడు. నాన్నా అంటూ దగ్గరికి వెళ్లగా.. టింకూ వర్మ కూడా కొడుకును గుర్తుపట్టాడు. పదేండ్ల తర్వాత కలుసుకున్న తండ్రీ కొడుకులు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇద్దరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ తండ్రీకొడుకుల గురించి తెలిసి అక్కడ ఉన్నవారు కూడా చలించిపోయారు.

డివైన్ ఓంకార్ మిషన్ సంస్థ శివమ్‌‌ను అతని తండ్రికి అప్పగించింది. ఈ సందర్భంగా  శివమ్ మాట్లాడుతూ.. ''జీవితంలో మళ్లీ మా నాన్నను కలుస్తానని అనుకోలేదు. ఇది నాకు దేవుడిచ్చిన వరం. నన్ను 10 ఏండ్లు పెంచిన 'డివైన్ ఓంకార్ మిషన్'కు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పాడు. పదేండ్లుగా తన కొడుకును జాగ్రత్తగా చూసుకున్నందుకు టింకూ వర్మ కూడా సంస్థకు థ్యాంక్స్ చెప్పాడు.