స్వీట్లు తినిపించిన చేతితోనే.. ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి..

స్వీట్లు తినిపించిన చేతితోనే.. ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి..

తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య విడిచి వెళ్లిపోయిందని కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేశాడు ఓ తండ్రి. తమిళనాడులోని తంజావూర్ జిల్లా ముదుక్కూర్ సమీపంలో గోపాలసముద్రంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( అక్టోబర్ 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..గోపాలసముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. వినోద్ కు నిత్యతో వివాహం కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ముగ్గురు పిల్లలతో వినోద్, నిత్యల కాపురం సజావుగా సాగుతుండగా.. నిత్యకు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడికి చెందిన ఒకరితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట ఆమె భర్త, పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది నిత్య. వినోద్ కొద్దిరోజుల కిందట భార్యను కలిసి తిరిగి రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. 

ఈ క్రమంలో వినోద్ పిల్లలకు స్వీట్లు తెచ్చి తినమని ఇచ్చాడు. స్వీట్లు తింటుండగానే.. కత్తితో ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపాడు వినోద్. ఏం జరుగుతుందో తెలిసేలోపే ముగ్గురు పసిబిడ్డలు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు వినోద్.

ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. తమ పంతాల కోసం అభం శుభం తెలియని పసిపిల్లలను అన్యాయంగా చంపేశాడంటూ వినోద్ పై మండిపడుతున్నారు బంధువులు, స్థానికులు. పిల్లల మరణానికి కారణమైన తండ్రికి.. పరోక్షంగా కారణమైన తల్లి నిత్యను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బంధువులు.