
- పైసలిచ్చిన వ్యక్తి దాడి చేయగా మృతి
ఎల్బీనగర్,వెలుగు: కుమారుడికి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి దాడి చేయడంతో తండ్రి చనిపోయిన ఘటన ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. నాగోల్ పరిధి బండ్లగూడలో ఉండే బల్ల ఆనంద్(55) అదే ఏరియాలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతడి కొడుకు చంద్రశేఖర్ కొన్ని నెలల క్రితం ఫ్రెండ్ రవి(24) దగ్గర రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. రూ.8 వేలు తిరిగి ఇచ్చాడు. గురువారం రాత్రి 11.30 గంటలకు రవి మద్యం తాగి చంద్రశేఖర్ ఇంటికి వచ్చి మిగతా డబ్బుల కోసం అతడితో గొడవపడ్డాడు. ఇంట్లోనే ఉన్న చంద్రశేఖర్ తండ్రి ఆనంద్ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న రవి రాయితో ఆనంద్ తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌ను కుటుంబసభ్యులు ఉస్మానియాకి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ అతడు చనిపోయాడు. చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. నిందితుడు రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.