ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష..సర్కారుకు ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష..సర్కారుకు ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

బషీర్‌‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే తాను ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌ బషీర్‌‌బాగ్ ప్రెస్‌‌క్లబ్‌‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పగిళ్ల సతీష్, కన్వీనర్ మోదీ రాందేవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని మంత్రులు, అధికారులకు ఉన్నప్పటికీ, సీఎం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. బకాయిల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, విద్యార్థుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్ల బకాయిలనైనా తక్షణమే విడుదల చేయాలని, కాలేజీల యాజమాన్యాలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

సీఎం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు క్లాసులను బహిష్కరించి, కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు.  సుమారు 5 లక్షల మందితో హైదరాబాద్ సిటీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఇంతటి ప్రజా ఆందోళనల తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీలం వెంకటేష్, గొరిగ మల్లేష్ యాదవ్, టి. రాజేందర్, జి. ఆనంతయ్య, శివ కుమార్ ముదిరాజ్, బలరాం, సిద్దు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.