అసలేం జరుగుతోంది.. ఆగని చీతాల మరణాలు

అసలేం జరుగుతోంది.. ఆగని చీతాల మరణాలు

దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రాజెక్టు చీతాలో భాగంగా మొత్తం 20 చీతాలను రెండు విడతల్లో భారత్ కు తీసుకువచ్చింది.  2022 సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్కుకు తీసుకొచ్చారు. 

రెండో దశలో ఈ ఏడాది 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. అయితే ఈ 20చీతాల్లో 5 నెలల వ్యవధిలో 9 చీతాలు మృతి చెందాయి.   2023  మార్చి 27వ తేదీన సాషా అనే ఆడ చీతా ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత  ఏప్రిల్ 23న  ఉదయ్ అనే చీతా మరణించింది. ఆ తర్వాత 20 రోజులకే మే 9న దక్ష అనే ఆడ చీత మృతి చెందింది. 

అదే నెలలో మూడు కూన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఆ తర్వాత జూలై 11వ తేదీన తేజస్‌ అనే మగ చీతా  మరణించింది. జూలై 14వ తేదీన సూరజ్  అనే చీతా ప్రాణాలు కోల్పోయింది. తాజాగా ఇవాళ  ఆగస్టు 2న   ధాత్రి అనే ఆడ చిరుత మృతి చెందింది. కానీ వీటి మృతికి సంబంధించిన కారణాలు ఇప్పటికి తెలియడం లేదు.  

విదేశాల నుంచి తీసుకువచ్చిన  ఈ చీతాలు భారత్ లో మనుగడ సాధించలేకపోతున్నాయని పలువురు భావిస్తున్నారు.  వాతావరణానికి అలవాటుపడలేక అవి  ఇబ్బందిపడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.