- మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని గంగారాం సాయిబాబా కాలనీకి చెందిన బలిజ దివ్య (26) కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ధారూర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం దివ్య తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు.
తండ్రి మరణం తర్వాత కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులతో కలిగిన మానసిక వేదనే తన మరణానికి కారణమని ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ‘‘నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు. అమ్మా నన్ను క్షమించు’’ అని లేఖలో రాశారు. తన మరణానికి మానసిక ఒత్తిడే కారణమని దివ్య వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
