- ఆదివారం సెలవు అంటూ పోలీసుల నిర్లక్ష్య సమాధానం
- ప్రశ్నించినందుకు రెండు గంటలపాటు నిర్బంధం
- సీసీఎస్ ముందు తోటి జర్నలిస్టుల ఆందోళన
- ఉన్నతాధికారులు జోక్యంతో సద్దుమునిగిన వివాదం
బషీర్‌బాగ్, వెలుగు: ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఓ మహిళ జర్నలిస్ట్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దాదాపు రెండు గంటలపాటు స్టేషన్లోనే నిర్బంధించారు. ఓ చానెల్లో యాంకర్‌గా పని చేస్తున్న బాధిత జర్నలిస్ట్ రెహనా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆమె ఫోన్లో ఓ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్కావడంతో ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది. ఆమె బంధువులు, స్నేహితుల నంబర్లకు స్కామర్స్ డబ్బులు పంపించాలని మెసేజ్‌లు పెట్టడంతో పలువురు డబ్బులను బదిలీ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న బాధిత జర్నలిస్ట్ రెహనా బషీర్ బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే ఆదివారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు సెలవు అని, ఆ మాత్రం తెలియకుండా ఎలా వస్తారంటూ సీసీఎస్‌లో పని చేస్తున్న ఓ ఎస్పై దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జర్నలిస్ట్ తాను పనిచేస్తున్న చానెల్‌కు సమాచారం ఇవ్వడంతో సీసీఎస్ పోలీసులు ఆమె ఫోన్‌ను లాక్కొని అక్కడే కూర్చోబెట్టారు.
విషయం తెలుసుకున్న రవితేజ యాదవ్, సంతోష్ గుప్తతో పాటు పలువురు జర్నలిస్టులు సీసీఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆమెను బయటకు పంపించాలని గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులతో మాట్లాడారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై చర్యలు తీసుకుంటామని క్రైమ్స్ అడిషన్ సీపీ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల తర్వాత మహిళ జర్నలిస్ట్‌ను బయటకు పంపించారు.
