- ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన.., తీవ్ర ఉద్రిక్తత
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి సర్పంచ్ చనిపోగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి కౌంటర్కు నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి మంటలు ఆర్పి ఆందోళనకారులను సముదాయించారు.
వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీ కాలనీకి చెందిన సర్పంచ్ వెంకటరమణ(36) తీవ్రమైన కాలినొప్పితో ఇటీవల భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా, సడెన్‌గా ఆమె ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రి యాజమాన్యం వెంటనే తమ అంబులెన్స్ లో వెంకటరమణను శుక్రవారం రాత్రి ఖమ్మం తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
అనంతరం డెడ్‌బాడీని భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. హైడోస్ యాంటీబయాటిక్స్ వాడడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన భార్య చనిపోయిందంటూ భర్త ప్రేమ్‌చంద్ ఆరోపించాడు. డాక్టర్లను అరెస్ట్ చేయాలని, వారి సర్టిఫికెట్లు రద్దు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీపీఐ శ్రేణులు కూడా భారీగా హాస్పిటల్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది.
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆందోళనకారులు లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆసుపత్రి కౌంటర్కు నిప్పు అంటుకొని వ్యాపించాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. చివరకు యాజమాన్యం దిగి వచ్చి వారితో చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.
