నిజాం రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ

నిజాం రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ

నిజాం రాజ్య భూమిశిస్తు విధానానికి (దివానీ లేదా రైత్వారీ) బొంబాయి ప్రెసిడెన్సీ భూమి శిస్తు విధానం ఆధారమైంది. రైత్వారీ పద్ధతిలో రైతులు పట్టాదారు భూములను కలిగి ఉంటారు. ఈ విధానంలో రైతు భూమిశిస్తును సక్రమంగా చెల్లించినంతకాలం భూమి రైతు కిందనే ఉండేది. గ్రామ అధికారులు పటేల్(గ్రామ పెద్ద), పట్వారీ (గ్రామ రెవెన్యూ అధికారి), పోలీస్​ పటేల్​లు భూమిశిస్తు వసూలులో ముఖ్యపాత్ర వహించేవారు. పేషకష్​(కప్పం/ పన్ను), జాగీర్​ భూములపై మామిడి తోటలపై పచ్చిక బయళ్లపై ఉమ్లీ(మక్తా పన్ను లాంటిది), అగ్రహారాలు (శాశ్వత స్థిరపన్ను) మొదలైన వాటి నుంచి శిస్తును వసూలు చేసేవారు. 

దివానీ/ ఖాల్సా భూములు

ప్రభుత్వానికి చెందిన భూములను దివానీ లేదా ఖాల్సా భూములు అంటారు.  ఈ పద్ధతిని 1875లో సాలార్​ జంగ్​–1 ప్రవేశపెట్టాడు. నిజాం సంస్థానంలో దివానీ భూములు లేదా ప్రభుత్వ భూములు 59.21శాతం ఉండేవి. వీటి నుంచి వచ్చే రెవెన్యూ వసూలు రాజ్య కోశాగారానికి వెళ్తుంది. హైదరాబాద్​ సంస్థానంలో రైత్వారీ విధానం తర్వాత ఆచరణలో ఉన్న ముఖ్య భూమిశిస్తు విధానం ఇజారా పద్ధతి( అటవీ ప్రాంత భూములను ఆక్రమించి తక్కువ కౌలు చెల్లించేవారు). 1948లో హైదరాబాద్​ సంస్థానం భారత యూనియన్​లో విలీనమయ్యే నాటికి దివానీ భూములు ఉన్న గ్రామాల సంఖ్య 13,816. ఈ భూముల వైశాల్యం 5,30,000 ఎకరాలుగా ఉండేవి. దివానీ కింద ఉండే భూములు సారవంతమైనవి కావు. వీటికి నీటిపారుదల సౌకర్యాలు ఉండేవి కావు. అందువల్ల దివానీ భూములను ఎవరూ ఆక్రమించేవారు కాదు. 

జాగీర్దారీ భూములు

జాగీర్​ అనే పదం పర్షియన్​ పదం. జాగీర్​ అంటే కలిగి ఉండటం. దార్​ అంటే అధికారి. జాగీర్​ భూములను ఇవ్వడమనేది 13వ శతాబ్దంలో ముస్లింల పరిపాలనలో  ప్రారంభమైంది. ఈ విధానాన్ని ముఖ్యంగా ఢిల్లీ సుల్తానులు ప్రవేశపెట్టారు. మొత్తం భూభాగంలో 40శాతం భూమిని జాగీర్దారులకు కొన్ని షరతులతో లేదా షరతులు లేకుండా ఇచ్చారు. జాగీర్దారుల సేవలను ప్రధానంగా సైనిక అవసరాలకు వాడుకున్నారు. నిజాం ప్రత్యేక యోగ్యత కలిగిన వారికి ఇచ్చే భూములను ఇనాం లేదా జాగీర్​ భూములు అనేవారు. నిజాం నవాబుకు, ప్రభుత్వానికి సేవ చేసినందుకుగాను ఈ భూములను ఇచ్చేవారు. ఈ భూముల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయం ప్రధాన మంత్రి కింద ఉండే ప్రభుత్వ కోశాగారానికి వెళ్లేది. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కొంత మంది వ్యక్తులకు జాగీర్​ లేదా ఇనాం రూపంలో ఇచ్చేవారు. 

జాట్​ జాగీర్లు

ఈ జాగీర్లు అతి పెద్ద భూ విస్తీర్ణాన్ని కలిగి ఉండేవి. వీటికి గల మరో పేరు ఖాన్​కా జాగీర్. నిజాం కోసం తన జీవితం మొత్తం సేవ చేసిన వారికి ఇచ్చే భూములను జాట్​ జాగీరులు అంటారు. వీటిని పొందినవాళ్లు జీవితాంతం అనుభవించేవారు. ఈ జాగీర్దారులు తమ ఆదాయంపైన న్యాయపరమైన హక్కు కలిగి ఉండేవారు. వీరికి ఆరోగ్య, విద్య, భూమి కొలతల శాఖ మొదలైన వాటి నుంచి పొందిన భూములపై అన్నిరకాల పన్నుల నుంచి మినహాయింపు ఉండేది.  అల్​తమ్​గా జాగీర్​: అల్​, తమ్​గా అనేవి రాజ చిహ్నానికి  గల రెండు గుర్తులు. ఈ పదం టర్కీ భాషకు చెందింది. నిజాం తన వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టినవారికి ఈ భూములను ఇచ్చేవాడు. వీటిని పొందే జాగీర్దార్​లు శాశ్వతమైన, వంశపారంపర్యంగా పొందే హక్కును కలిగి ఉండేవారు. ఈ జాగీర్దారులు కూడా నిజాంకు భూమిశిస్తు చెల్లించేవారు కాదు. ఈ భూములను పొందిన జాగీర్దారులకు వీటిని అమ్ముకునే హక్కు ఉండేది కాదు. ఎవరైనా అమ్మదలిస్తే ముందుగా రాజు అనుమతిని పొందాలి. 

తనఖా జాగీర్​ 

ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలకు బదులు భూములు ఇచ్చేవారు. వీటిపై శిస్తు వసూలు చేసే అధికారం వీరికి ఉండేది. ఇది కూడా పైగా జాగీర్​ వంటిదే. కానీ వీటికి చట్టబద్ధత ఉండేది కాదు.  మశ్రూతి జాగీర్​ : మతాధికారులకు, సైనికులకు ఇచ్చే భూములు. ఇది కొన్ని షరతులతో కూడుకున్న జాగీర్​. మదద్​–ఇ–మాష్​ జాగీర్​: సమాజం కోసం జీవించేవారికి ఈ జాగీర్​లను ఇచ్చేవారు.  సర్ఫ్​–ఎ–ఖాస్​ భూములు: ఇవి రాచరికపు భూములు. ఈ భూములు నిజాం కుటుంబానికి చెందినవి. నిజాంకు వ్యక్తిగత సైన్యం  పేరు సర్ఫ్​–ఎ–ఖాస్. ఇది అరబిక్​ పదం. దీని అర్థం వ్యక్తిగత  వ్యయం. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని నిజాం తన సొంత అవసరాలకు ఉపయోగించుకునేవాడు. వీటి విస్తీర్ణం 10,000 చ.మైళ్లు. నిజాం సంస్థానంలో ఈ భూములు 10శాతం వరకు కలవు. ఈ భూములు అత్రాఫ్​బల్దా జిల్లాలో అధికంగా ఉండేవి.  ఇనాం భూములు: ఇనాం అనేది అరబ్బీ భాషా పదం. ఈ భూముల వ్యవస్థ ముఖ్యంగా హిందూ, ముస్లిం పాలకుల వ్యవస్థగా రూపుదిద్దుకున్నది. హిందూ, ముస్లిం పాలకులు సేవకుల నుంచి సేవలను పొందిన దానికి లేదా భవిష్యత్తులో పొందబోయే సేవలకు గుర్తింపుగా ఈ భూములు ఇచ్చేవారు. ఇనాం అనేది బహుమతిగా ఇచ్చిన భూమి లేదా భూమి శిస్తు.

పైగా జాగీర్​

పైగా అంటే స్థిరం అని అర్థం. ఈ జాగీర్​ మొత్తం విస్తీర్ణం రెండు చదరపు మైళ్లు. ఇందులోని గ్రామాల సంఖ్య 1000. వీటి నుంచి సంవత్సరానికి రూ.30లక్షల ఆదాయం వచ్చేది. ఈ జాగీర్​లను సాధారణంగా గుర్రాల నిర్వహణకు పొందేవారు. ఈ భూములను పొందినవారు నిజాం సైన్యాల నిర్వహణలో ప్రముఖపాత్ర వహించే వారు. వీరు ప్రభుత్వంలో అత్యంత పలుకుబడి గల వర్గంగా గుర్తింపు పొందారు. వీటికి గల మరో పేరు జాగిరత్​ ఇ నిగదస్సు జామతీ. ఇవి సైనిక జాగీర్​కు చెందినవి. పరిపాలన విధానాలు పూర్తిగా వీరి ఆధీనంలో ఉండేవి. ఈ భూములను పొందినవారు నిజాంకు ఎలాంటి శిస్తు చెల్లించాల్సిన అవసరం లేదు. వీరు పూర్తిగా దివానీ హక్కులు పొందేవారు. ఆరోగ్యం, విద్య మొదలైన విభాగాలను అదనంగా నిర్వహించేవారు.