అఫిడవిట్లతో  ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన

అఫిడవిట్లతో  ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
  • టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణ
  • అధికార పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ఇంటింటి ప్రచారం చేస్తామని ప్రకటన

హుజూరాబాద్ టౌన్, వెలుగు: హుజూరాబాద్ బై ఎలక్షన్ లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్ లో అఫిడవిట్లతో నిరసన తెలిపారు. నామినేషన్ వేయకుండా పోలీసులు, రిటర్నింగ్ అధికారులు తమను అడ్డుకుంటున్నారని, బలపరచడానికి వచ్చిన ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా పోలీసులు, రిటర్నింగ్ అధికారులతో విసిగిపోయిన వారంతా మధ్యాహ్నం12  నుంచి 3 గంటల వరకు భారీ సంఖ్యలో రోడ్డు వెంట బారులు తీరారు. క్యూలో నిలబడి అఫిడవిట్లు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక షాపుల్లోకి వెళ్లి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో  తిరిగి శుక్రవారం నుంచి ఇంటింటి ప్రచారం చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు నియోజకవర్గ ఓటర్లను కలుస్తామన్నారు. ఏ పార్టీకైనా ఓటు వేయండి కానీ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తామని, తమ గోడు చెప్పుకుంటామని తెలిపారు. 
ఎట్టకేలకు ఒక నామినేషన్
మూడు రోజులు ప్రయత్నం అనంతరం గురువారం ఎట్టకేలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం రమేశ్​ నామినేషన్ దాఖలు చేశారు. తనను బలపరిచే పది మంది స్థానిక ఓటర్లను వెంటబెట్టుకుని వెళ్లి నామినేషన్ సమర్పించారు. 

కేసీఆర్​ను నిరుద్యోగిని చేస్తం
వెయ్యి నామినేషన్లు వేస్తామని ప్రకటించినప్పటికీ పోలీసులు, ఎన్నికల అధికారుల అడ్డంకుల కారణంగా వేయలేకపోయామని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జేఏసీ వైస్ చైర్మన్ చింత కృపాకర్ ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వెళ్లాలంటే మూడంచెల పోలీసు తనిఖీని దాటుకుని వెళ్లాల్సి వస్తోందని, ఇవన్ని దాటుకుని వెళ్తే లోపల హెల్ప్ డెస్క్ లోని ఎన్నికల అధికారులు.. తమకు హెల్ప్ చేయకపోగా నామినేషన్లను రిజెక్ట్ చేసి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బుధవారం సెకండ్ డోస్ సర్టిఫికెట్ ఉన్న పది మందిని తీసుకుని వెళ్తే.. మూడు గంటలపాటు వెయిట్ చేయించిన ఎన్నికల అధికారులు.. టైం అయిపోయిందని బయటికి పంపించారని తెలిపారు. తమ ఉద్యోగాలను ఊడదీసిన సీఎం కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.