- నేటి నుంచి జూనియర్ హాకీ వరల్డ్ కప్
- నేడు చిలీతో ఇండియా ఢీ
చెన్నై: ఎఫ్‌ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీకి ఇండియా కుర్రాళ్లు రెడీ అయ్యారు. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో చిలీతో ఆడనున్నారు. ఈ టోర్నీలో (2001, 2016) రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండియా.. తొమ్మిదేండ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న తాజా టోర్నీలో గెలిచి మూడో టైటిల్ నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్ ఈసారి బరిలోకి దిగడం లేదు.
దాంతో పూల్–బిలో ఒమన్, స్విట్జర్లాండ్‌తో ఇండియా తలపడనుంది. 1979లో ప్రారంభమైన ఈ టోర్నీలో జర్మనీ ఇప్పటి వరకు ఏడు టైటిల్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అర్జెంటీనాతో పాటు ఇండియా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2023 కౌలాలంపూర్‌లో జరిగిన చివరి ఎడిషన్‌లో నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఈ టోర్నీకి చెన్నై, మధురై ఆతిథ్యమిస్తుండగా, 24 జట్లు పోటీలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు వెళ్తాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
