విమలక్క  50 ఏండ్ల పోరాటం స్ఫూర్తిదాయకం..జనంలో ఉంటూ వారి కోసం కొట్లాడారు: సినీ డైరెక్టర్‌‌‌‌ ఉమామహేశ్వరరావు

విమలక్క  50 ఏండ్ల పోరాటం స్ఫూర్తిదాయకం..జనంలో ఉంటూ వారి కోసం కొట్లాడారు: సినీ డైరెక్టర్‌‌‌‌ ఉమామహేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: విమలక్క 50 ఏండ్లుగా జనంలో ఉంటూ, వారి కోసం నిలబడి కొట్లాడారని సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఎన్నో ప్రభుత్వాల నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజా సంస్కృతిని కాపాడుతున్నారన్నారు. హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 గంటల ప్రజా కళాజాతర శనివారం ప్రారంభమైంది. సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు కళాజాతరను ప్రారంభించి మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంస్కృతి వైపు నిలబడటం సాహసోపేతమైన విషయమన్నారు. తొలుత బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు వేలాది మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కల్యాణ మండపం ప్రాంగణంలో అంబిక అరుణోదయ పతాకాన్ని ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె ఫొటోకు విమలక్క పూలమాలలు వేసి నివాళి అర్పించారు.