పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు:  గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్​ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బీఆర్​కే భవన్​లో వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫారసులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు  కోదండరెడ్డి తెలిపారు.

ఎక్కువ మంది రైతులు వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పంటల మార్పిడి అత్యవసరమన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని..ఆ దిశగా రైతులు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం, భవిష్యత్ వ్యవసాయ ప్రణాళికలు, రైతుల ఆదాయాభివృద్ధిపై తుది నివేదిక రూపొందించే దిశగా  కమిషన్ కీలక అడుగులు వేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పంటల విధానం, నీటి లభ్యత, భూసార పరిస్థితులు, మార్కెట్ డిమాండ్, రైతుల ఆర్థిక పరిస్థితులపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా పంటల మార్పిడి ద్వారా రైతుల ఆదాయం పెంపు, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భూసార పరిరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను రూపొందించడం వంటి అంశాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. హార్టీకల్చర్​ పంటల విస్తరణ, మిల్లెట్లు, పప్పుదినుసుల సాగును ప్రోత్సహించడం, సమావేశానికి  రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు.