బెంగళూరులో దారుణం: ర్యాగింగ్ చేస్తూ స్టాఫ్‌పై దాడి.. 22 మంది విద్యార్థులపై కేసు!

బెంగళూరులో దారుణం: ర్యాగింగ్ చేస్తూ స్టాఫ్‌పై దాడి.. 22 మంది విద్యార్థులపై కేసు!

బెంగళూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్ చేయడమే కాకుండా, అడ్డుకున్న కాలేజీ స్టాఫ్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు 22 మంది విద్యార్థులతో పాటు మరో బయటి వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

 దేవనహళ్లిలోని ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఈ ఘటన జరిగింది. కాలేజీ అడ్మిషన్స్ హెడ్ మిధున్ మాధవన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... జనవరి 14న సీనియర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చదువుతున్న జూనియర్లను వేధించారు. వీరికి సిగరెట్లు, డ్రింక్స్ తీసుకురావాలని, అలాగే వాళ్ళ  బుక్స్ కూడా మోయాలని ఆర్డర్ వేశారు.

 దింతో  జూనియర్లు ఈ విషయాన్ని మాధవన్‌కు చెప్పడంతో, ఆయన సీనియర్లను పిలిచి ఇలాంటి పనులు చెయ్యొద్దని  హెచ్చరించారు. సీనియర్లు వినకుండా తరువాత రోజు అంటే జనవరి 15న మళ్ళీ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మాధవన్, జూనియర్లను తీసుకుని కాలేజీ వెనుక ఉన్న ఒక టీ కొట్టు దగ్గర సీనియర్లను కలవడానికి వెళ్లారు. అక్కడ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

  ఆ సమయంలో గొడవ పెద్దదయ్యింది. సీనియర్ విద్యార్థులతో పాటు వచ్చిన నవీన్ అనే బయటి వ్యక్తి.... ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో జూనియర్లు సహ మాధవన్‌పై  దాడి చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే వదిలేది లేదని స్పష్టం చేశారు.