దిశ నిందితులపై హత్యాయత్నం కేసు

దిశ నిందితులపై హత్యాయత్నం కేసు

హైదరాబాద్, వెలుగు: దిశ నిందితులపై షాద్​నగర్​ పోలీస్​స్టేషన్​లో హత్యాయత్నం కేసు నమోదైంది. అది కూడా ఎన్​కౌంటర్​లో నిందితులు చనిపోయిన రెండున్నరగంటల్లో ఫైల్​ అయింది. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని అందులో పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్​ఐఆర్​ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ డిసెంబర్​ 6న ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య జరిగిందని అదే రోజు సీపీ సజ్జనార్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్ కౌంటర్ జరిగిన రోజే ఉదయం 8.30 గంటలకు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితులు మహ్మద్‌‌‌‌ ఆరిఫ్‌‌‌‌(26), జొల్లు శివ(19), జొల్లు నవీన్‌‌‌‌(19) చెన్న కేశవులు(19)ను ఈ నెల 4న కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నామని, వారు ఇచ్చిన సమాచారంతో బాధితురాలి వస్తువులను రికవరీ చేసేందుకు చటాన్‌‌‌‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా ఉదయం 6.10 గంటల సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని ఫిర్యాదులో ఏసీపీ తెలిపారు. ఆరిఫ్, చెన్నకేశవులు  పోలీసుల చేతుల్లోంచి వెపన్స్  గుంజుకొని ఫైరింగ్ జరిపారని, దీంతో ఆత్మరక్షణ కోసం అక్కడే ఉన్న పోలీసులు కాల్పులు జరుపగా  నలుగురు నిందితులు చనిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహ్మద్ ఆరిఫ్ (26) మినహా శివ, నవీన్, చెన్నకేశవులు వయస్సును 19 ఏండ్లుగా ఫిర్యాదులో ప్రస్తావించారు.