Deepthi Jeevanji: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో తెలంగాణ యువతికి గోల్డ్ మెడల్

Deepthi Jeevanji: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో తెలంగాణ యువతికి గోల్డ్ మెడల్

సోమవారం(మే 20) జపాన్‌లోని కోబ్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2024లో భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి 55.06 సెకన్లలోనే పరుగును పూర్తి చేసి స్వర్ణం చేజిక్కించుకుంది. తద్వారా ఈ ఏడాది జరిగే పారిస్‌ వేదికగా జరిగే పారా ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించింది. 

ఈ పోటీల్లో టర్కీకి చెందిన అసైల్ ఒండర్ 55.19 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, ఈక్వెడార్‌కు చెందిన లిజాన్ శెలా అంగులో 56.68 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. టీ20 పారాను మేధో వైకల్యం ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహిస్తారు. 

దీప్తి భారత క్రీడల్లో హెడ్‌లైన్‌లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది హాంగ్‌జౌ వేదికగా జరిగిన పారా ఏషియన్ గేమ్స్‌లోనూ ఆమె స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఎవరీ దీప్తి జీవన్‌జీ..?

తెలంగాణలోని వరంగల్ జిల్లా, కల్లెడ గ్రామం దీప్తి స్వస్థలం. తండ్రి పేరు.. యాదగిరి. తల్లి పేరు.. ధనలక్ష్మి. వీరు రోజువారీ దినసరి కూలీలు. 2003లో జన్మించిన దీప్తి హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీలో మానసిక వికలాంగుల విభాగంలో సర్టిఫికేట్ పొందింది. భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ సూచన మేరకు పారా అథ్లెట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి లభించింది.

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2024లో 55.07 సెకన్లలో పరుగు పూర్తి చేసిన దీప్తి.. గతేడాది ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును (55.12 సెకన్లు) బద్దలు కొట్టింది. తన ప్రదర్శనతో దేశానికి, తెలంగాణ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన దీప్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.