కరెంటోళ్ల నిర్లక్ష్యంతో కాలి బూడిదైన ఇల్లు

కరెంటోళ్ల నిర్లక్ష్యంతో కాలి బూడిదైన ఇల్లు

రంగారెడ్డి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడ ఎల్ఐసీ కాలనీలో ఘోరం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘఠనలో ఓ ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే ఇళ్లంతా వ్యాపించాయి. మంటలంటుకున్న విషయం గ్రహించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఎయిర్ బెలూన్స్ మంటల్ని అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మీటర్ నుంచి మంటల చెలరేగడంతో అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యంగా కారణంగా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగలాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి అధికారులే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.