- వాణిజ్యం, బలమైన భాగస్వామ్యంపై చర్చలు
- కెనడా పంథాలో మార్పు.. ఇండియా పట్ల సానుకూలత
- ట్రాన్స్‌నేషనల్ రిప్రెషన్ ఆరోపణలపై ఆ దేశం వెనక్కి
న్యూఢిల్లీ: ఇండియా – కెనడా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంలో ఆ దేశంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ పై పలు ఆరోపణలు చేశారు. అయితే మార్క్ కార్నీ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి మన దేశంతో స్నేహసంబంధాలు గాడినపడుతున్నాయి. తాజాగా కార్నీ భారత్‌లో పర్యటించనున్నారు.
శుక్రవారం నుంచి మార్చి 2 వరకు ఆయన టూర్ ఉంటుంది. కార్నీకి ఇది మొదటి భారత్ పర్యటన. వాణిజ్యం, బలమైన భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. హైదరాబాద్ హౌస్ లో డెలిగేషన్ స్థాయి చర్చలు ఉంటాయి. ఈ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యే చాన్స్ ఉంది.
వాణిజ్యం, ఇతర రంగాలపై చర్చలు
రెండు దేశాల నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఇన్నోవేషన్స్, ప్రజల మధ్య సంబంధాలపై చర్చిస్తారు. భారత్–-కెనడా సీఈవోల ఫోరమ్ కూడా ఏర్పాటు అవుతున్నది. గతేడాది సమావేశాల ఆధారంగా పురోగతిని సమీక్షిస్తారు. ఈ టూర్‌తో రెండు దేశాల మధ్య వాణిజ్యం బాగా పెరిగే అవకాశం ఉంది. ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చర్చలు కూడా పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
మెరుగవుతున్న సంబంధాలు
భారత్ ఎన్నికల్లో కెనడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని తాజాగా ఆ దేశం పేర్కొన్నది. గతంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత్ పై పలు ఆరోపణలు చేసింది. అయితే ఇటీవలి అక్కడ జరిగిన దర్యాప్తులో ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని తేలింది. దీంతో 'ట్రాన్స్‌నేషనల్ రిప్రెషన్' ఆరోపణలపై కెనడా వెనక్కి తగ్గినట్టు సమాచారం.
ఇప్పుడు భారత్ తో మంచి సంబంధాల కోసం చర్చలు జరుగుతున్నాయని, విదేశీ జోక్యం అడ్డుకునే బలమైన చర్యలు తీసుకున్నామని కెనడా అధికారులు చెబుతున్నారు. భారత్ జోక్యం ఉందని నమ్మితే కార్నీ భారత్ పర్యటనకు రాడని అధికారులు చెప్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నదనేందుకు సంకేతమని అన్నారు.
