- 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు దగ్ధం
- కేస్ ఫైల్స్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో కమ్ముకున్న దట్టమైన పొగ
- మంటలు ఆర్పేందుకు యత్నించిన ఆఫీస్ బాయ్
- ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీసులోనే ముగ్గురు ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(టీజీఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో గల ఈ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉదయం 10.08 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నారు. మూడు అంతస్తుల బిల్డింగ్ అప్పటికే దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో ఫైర్‌ఫైటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్‌తో లోపలికి వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు పలు కంప్యూటర్లు, వివిధ నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు, కేస్ ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి.
కాలిపోయిన పేపర్లు, ఇతర ఆధారాలు, హార్డ్ డిస్క్‌లకు సంబంధించిన విడి భాగాలను క్లూస్ టీమ్ సిబ్బంది సేకరించారు. ఏయే కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయో తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదమా.. లేదంటే పథకం ప్రకారమే చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎమ్‌సీబీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
దట్టమైన పొగలతో ఎగిసిపడ్డ మంటలు..
ఎఫ్‌ఎస్‌ఎల్ బిల్డింగ్‌లో మూడు అంతస్తుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను టెస్ట్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కేసుల దర్యాప్తులో పోలీసులు సేకరించిన ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులోని ఓ రూమ్‌లో స్టోర్ చేశారు. రూమ్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ గదులు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్‌లో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటలకు ఆఫీస్ బాయ్ కృష్ణ సహా మరో ముగ్గురు ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చారు.
కాగా, ఉదయం 10.08 గంటల సమయంలో బిల్డింగ్‌లోని మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్ బాయ్ కృష్ణ గమనించాడు. అక్కడే ఉన్న ఉద్యోగులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతుండడంతో పక్కనే ఉన్న నాంపల్లి పోలీస్‌స్టేషన్, ఫైర్ సిబ్బందికి ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులు సమాచారం అందించారు.
దీంతో స్థానిక పోలీసులు, నాంపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఎల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగల కారణంగా లోపలికి వెళ్లలేక పోయారు. ఆక్సిజన్ సిలెండర్లు ధరించి మొదటి అంతస్తులోని మంటలను మధ్యాహ్నం 1:30 గంటల వరకు అదుపు చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టి పొగను బయటకు పంపించారు.
కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడికే
రాష్ట్రంలో నమోదైన తీవ్రమైన నేరాలు, అగ్నిప్రమాదాలు, బాంబు బ్లాస్టులు, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నయీం కేసులు సహా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు కీలకంగా మారాయి. నిందితుల ఫోన్లు, ఎస్‌ఐబీ హార్డ్ డిస్కుల నుంచి డిలీట్ చేసిన డేటాను ఎఫ్‌ఎస్‌ఎల్ రిట్రీవ్ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌తో పాటు సీజ్ చేసిన ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లను సిట్ అధికారులు ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేశారు.
కాగా, సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైన తర్వాత మరికొన్ని ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. దీంతో పాటు చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పరీక్షల కోసం వచ్చినట్లు తెలిసింది.
ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్‌శాంపిల్స్, హార్డ్‌డిస్కులు, సెల్‌ఫోన్లు, ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ భద్రంగా ఉందా..? అగ్ని ప్రమాదంలోకాలిపోయాయా? అన్న అంశంపై స్పష్టత
రావాల్సి ఉంది.
హార్డ్‌డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి
మాకు 10.20 గంటలకు ఫైర్ కాల్ వచ్చింది. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాం. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయి. సమీపంలోని మరో రెండు ఫైర్ టెండర్లు రప్పించాం. ఫస్ట్ ఫ్లోర్‌లో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఉంది, హార్డ్ డిస్కులు, కీలకమైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయి.
సెకండ్ ఫ్లోర్‌లోని కెమికల్ ల్యాబ్‌కు, ఫస్ట్ ఫ్లోర్‌కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానిస్తున్నాం. ఎమ్‌సీబీ వద్ద కేబుల్స్ సేకరించి పరీక్షిస్తున్నాం.
- విక్రమ్ సింగ్ మాన్, డీజీ, ఫైర్ సర్వీసెస్
ఎవిడెన్స్ల్యాబ్ నిర్వహణ ఇక్కడి నుంచే
“నేర పరిశోధన సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్ లాబోరేటరీ ఆపరేషన్ ఇక్కడి నుంచే జరుగుతుంది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆఫీస్ బాయ్ కృష్ణ, నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారు. మంటలు గమనించి బయటికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.
- శిల్పవల్లి, డీసీపీ, సిటీ సెంట్రల్ జోన్
