V6 News

తెల్లారితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్.. ఇంతలోనే ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం

తెల్లారితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్.. ఇంతలోనే ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం

జైపూర్: మరికొన్ని గంటల్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉన్న రాజస్థాన్‎లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం (ఏప్రిల్ 20) ఆయిల్ రిఫైనరీలోని ఒక యూనిట్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రిఫైనరీ పరిసరాల్లో నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. క్షణాల్లో మంటలు తీవ్రరూపం దాల్చడంతో కార్మికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

 వెంటనే అప్రమత్తమైన ఎమర్జెన్సీ టీమ్స్ సహయక చర్యలు ప్రారంభించాయి. భారీగా ఎగిసి పడుతోన్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 30 ఫైరింజన్లతో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను మంగళవారం (ఏప్రిల్ 20) ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉంది.

 ఇంతలోనే ప్రధాని పర్యటనకు గంటల ముందు ఆయిల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాజస్థాన్ సీఎం భజన్‎లాల్ శర్మ ఆయిల్ రిఫైనరీకి కాసేపట్లో వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం వెళ్లకముందే ఈ ప్రమాదం జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

►ALSO READ | 'ఓ.. దేవుడా, ఏమవుతోంది...': గాలిలో 4 గంటలు చక్కర్లు కొట్టిన విమానం.. అసలేం జరిగిందంటే?

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు  చేపట్టారు. పీఎం, సీఎంల పర్యటనకు గంటల ముందే జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్య్కూటా లేక మరేదైనా కారణంగా ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్స కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 పచ్పద్ర ఆయిల్ రిఫైనరీ వివరాలు:

ఇది భారతదేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌. 2018,  జనవరిలో ప్రధాని మోడీ ఈ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు.  ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు ₹79,459 కోట్లు. ఈ రిఫైనరీ వార్షికంగా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) చమురును శుద్ధి చేయగలదు. ఈ ప్రాజెక్ట్  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (74%), రాజస్థాన్ ప్రభుత్వం (26%) మధ్య జాయింట్ వెంచర్.

ఈ రిఫైనరీలో రాజస్థాన్‎లోని మంగళ క్షేత్రాలలో లభ్యమయ్యే స్థానిక ముడి చమురుతో పాటు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న చమురును ప్రాసెస్ చేయనున్నారు. ఇక్కడ ఇంధనంతో పాటు, పాలిప్రొఫైలిన్, పాలిథిలిన్ వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా తయారు చేయనున్నారు. ఈ రిఫైనరీలో క్లిష్టమైన చమురును కూడా శుద్ధి చేయగలరు. 2026, ఏప్రిల్ 21న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం.