- భారీ పొగతో విద్యార్థుల ఉక్కిరిబిక్కిరి
- 3 నిమిషాల్లోనే చేరుకొని హైడ్రా రెస్క్యూ ఆపరేషన్
- తప్పిన పెను ముప్పు
హైదరాబాద్ సిటీ/ పంజాగుట్ట, వెలుగు: అమీర్పేట మైత్రివనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ (నీలగిరి బ్లాక్) లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదం విద్యార్థులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడు అంతస్తుల్లోని ఈ బిల్డింగ్లో పలు కోచింగ్ సెంటర్లు నడుస్తుండగా, గ్రౌండ్ ఫ్లోర్లోని సైన్ బోర్డులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ పైఅంతస్తుల్లోని కోచింగ్ సెంటర్లకు వ్యాపించి పరిస్థితి భయానకంగా మారింది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు భవనం చుట్టూ ఫ్లెక్సీలు కట్టడంతో పొగ బయటకు వెళ్లే దారి లేక లోపల ఉన్న విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న 50 మందిని హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగగా, సమాచారం అందుకున్న 3 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్లతో మంటలను నియంత్రించారు. మెట్ల మార్గం పొగతో నిండిపోవడంతో రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని రోప్ లాడర్ల సహాయంతో సురక్షితంగా కిందకు దించారు.
ఫైర్ చట్టాల్లో మార్పులు చేయాలి : ఏవీ రంగనాథ్
ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే పెను ప్రమాదం తప్పిందన్నారు. నెల రోజుల క్రితమే ఇక్కడ తనిఖీలు చేసి కొన్ని షాపులను సీజ్ చేశామని, నిబంధనల అమలుకు గడువు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
గడువు ముగిశాక మళ్లీ అన్ని శాఖలతో కలిసి కఠిన తనిఖీలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బాధితులను కాపాడిన 15 మంది డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగనాథ్ ప్రత్యేకంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.
