హైదరాబాద్ SR నగర్ క్రిష్ ఇన్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్ SR నగర్ క్రిష్ ఇన్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ క్రిష్ ఇన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి కూత వేట దూరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పై అంతస్తులో  ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక సిబ్బంది పై అంతస్తులకు మంటలు వ్యాపించకుండా ఆర్పి వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భయాందోళనకు గురి అయిన వారిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఇటీవల అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

కోట్లు పెట్టి నిర్మిస్తున్న అపార్ట్‌‌‌‌మెంట్లు, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్‌‌‌‌లో కూడా కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చడం లేదు. దీంతో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. భవన నిర్మాణం సమయంలో నాణ్యత లేని వైరింగ్ వాడడం కూడా షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌లకు కారణమవుతోంది.

వైరింగ్‌‌‌‌ను కనీసం 15 ఏండ్లకు ఒకసారి మార్చుతూ ఉండాలని, ప్యానల్ బోర్డు పక్కనే వైరింగ్‌‌‌‌కు సంబంధించిన స్కెచ్‌‌‌‌, ఆటోమెటిక్ ట్రిప్‌‌‌‌ స్విచ్‌‌‌‌లను ఏర్పాటు చేసుకోవాలని ఎక్స్పర్ట్స్​చెప్తున్నారు. 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉన్న అన్ని కనెక్షన్లకు అవసరమైనంత మేరకు ఎర్తింగ్ ఏర్పాటు చేయాలని, చిన్న ఖర్చుకు భయపడి నిబంధనలు పాటించకపోవడంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.