కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ' పరాశక్తి' సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే టాలీవుడ్ లో పెద్ద సినిమాలు క్యూలో ఉండటం, థియేటర్ల కొరత వంటి పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఫిబ్రవరి 7న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చించింది.
ఓటీటీలో రికార్డుల వేట
జీ5లో బహుళ బాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం తక్కువ సమయంలోనే ఓటీటీలో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే అన్ని భాషలలో కలిపి 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు వీక్షించబడ్డాయి. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్నా.. బుల్లితెరపై టాప్ లో నిలుస్తూ ఆదరణను పొందుతుంది.
కథా నేపథ్యం..
ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథ. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఆ కాలంలో సంచలనం సృష్టించింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు సోదరులు చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? వారి కుటుంబం ఈ రాజకీయ పోరాటంలో ఎలాంటి మూల్యం చెల్లించుకుంది? అనే అంశాలను సుధా కొంగర ఎంతో ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు.
టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె గ్లామర్, డ్యాన్స్‌తో పాటు నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ కాలం నాటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాల్లో రానా దగ్గుబాటి, మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మెరవడం సినిమాకు పాన్-ఇండియా అప్పీల్‌ను తీసుకొచ్చింది. ఇది పీరియడ్ డ్రామా కావడంతో 1960ల నాటి వాతావరణాన్ని సెట్స్, కాస్ట్యూమ్స్ ద్వారా అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. థియేటర్లలో రికార్లు సృష్టించిన శివకార్తికేయన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, సుధా కొంగర మార్క్ టేకింగ్ కలగలిసిన ‘పరాశక్తి’ ఓటీటీలో ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
