అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తేజ కాలనీలో పరుపుల తయారీ గోదాంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న పరుపులు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
పటాన్చెరు అగ్నిమాపక సిబ్బందితో పాటు పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. నివాసాల మద్య ఇలాంటి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పరుపుల తయారీ గోదాంకు ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు తెలిపారు.
