పటాకుల నిప్పు రవ్వలు పడి.. కాలి బూడిదైన వాహనాలు

పటాకుల నిప్పు రవ్వలు పడి.. కాలి బూడిదైన వాహనాలు
  •  ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ లో ఘటన

మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి బరాత్ లో పటాకులు కాలుస్తుండగా నిప్పు రవ్వలు లేచి ఓ పోలీస్ స్టేషన్ లో  సీజ్ చేసిన వాహనాలపై పడగా కాలిబూడిదయ్యాయి. ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. గురువారం రాత్రి10 గంటల ప్రాంతంలో ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పక్క గల్లీలోంచి ఓ పెండ్లి బరాత్ వెళ్తుంది. కొందరు యువకులు పటాకులు కాలుస్తుండగా నిప్పురవ్వలుపైకి లేచి పోలీస్ స్టేషన్ లోని సీజ్ చేసిన వాహనాలపై పడ్డాయి. 

దీంతో  సుమారు 50 వాహనాలు కాలి బూడిదయ్యాయి. మంటలు వ్యాపిస్తుండగా.. పక్క బిల్డింగ్ లో ఉండేవారిని ఖాళీ చేయించారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వగా వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా.. సీజ్ చేసిన వాహనాలు కాలిపోవడంతో  సంబంధిత వాహనదారులు ఆందోళన చెందారు. పెండ్లి బరాత్ లో పటాకులు కాలుస్తుండగా నిప్పురవ్వలు పడ్డాయా..?  లేక షార్ట్ సర్క్యూట్ అయిందా?  ఎవరైనా నిప్పు పెట్టారా..? అనే  కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.