బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ నుంచి రాబోతున్న చిత్రం ‘గవర్నర్’. ది సెలైంట్ సేవియర్ అనేది క్యాప్షన్. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళ స్టోరీ, కేరళ స్టోరీ 2 చిత్రాలతో విజయాలు అందుకున్న అమృత్ లాల్ షా నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ప్రీ లుక్ విడుదల చేశారు.
ఓ గ్రీన్ కలర్ కుర్చీ, దాని ముందు టేబుల్‌పై కొన్ని ఫైల్స్. గోడపై ఆర్‌బీఐ సింబల్. ‘భారత్ దివాలా అంచున ఉంది.. ఇది కుర్చీ కాదు ఓ బాధ్యత’ అని పోస్టర్ రాసుండటం ఆసక్తి రేపుతోంది. మరో పోస్టర్‌లో లెదర్ సూట్‌కేస్ పట్టుకుని మనోజ్ బాజ్‌పాయ్ నడిచి వెళ్తుండగా.. ‘నేను ఫెయిల్ అయితే భారతదేశం మొత్తం ఫెయిల్ అవుతుంది’ అని రాసుంది. మన దేశం ఓ ప్రపంచ శక్తిగా ఎదగడానికి కారణమైన ఓ అజ్ఞాత వీరుడి కథతో ఈ సినిమా రాబోతోందని ప్రకటించారు. ఇదొక బయోపిక్ అని కూడా తెలుస్తోంది. ఎవరి లైఫ్ స్టోరీ అనేది తెలియాల్సి ఉంది. జూన్ 12న సినిమా విడుదల కానుంది.

