మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని కలకోట గ్రామ చెరువులో దొంగతనంగా చేపలు పట్టేందుకు కొంతమంది చేసిన ప్రయత్నించగా మత్స్య సహకార సంఘం సభ్యులు సకాలంలో స్పందించి భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా చెరువులోకి చొరబడి, పెద్ద ఎత్తున చేపలను తరలించేందుకు వలలు విసిరి వేట సాగించారు. చెరువు సమీపంలో హడావిడిని గ్రామస్తులు గమనించి, వెంటనే మత్స్యకారులకు సమాచారం అందించారు.
హుటాహుటిన మత్స్యకారులు, గ్రామస్తులతో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన దొంగలు భయంతో వలలు, బుట్టలు, ఇతర వేట సామగ్రిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మత్స్యకార సంఘం ప్రతినిధులు తెలిపారు.సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరారు.
