బడ్జెట్ భారం.. చేపల చావు ఖాయం..! ఎండిపోయిన మాసబ్ ట్యాంక్ చెరువు... మృత్యువాత పడుతున్న చేపలు...

బడ్జెట్ భారం.. చేపల చావు ఖాయం..! ఎండిపోయిన మాసబ్ ట్యాంక్ చెరువు... మృత్యువాత పడుతున్న చేపలు...
  • మాసాబ్​ ట్యాంక్​ చెరువులో ఒక ట్యాంకర్​ నీళ్లు నింపిన అధికారులు
  • 100 చేపలు డ్రమ్ముల్లోకి చావుకు దగ్గరలో మరో వెయ్యి చేపలు 

మెహిదీపట్నం, వెలుగు:  మాసబ్ ట్యాంక్  చెరువు ఎండిపోయి అందులోని జలచరాలు మృత్యవాతపడుతుండడంతో  సోమవారం ‘నీటి కరువు.. గుండె చెరువు’ హెడ్డింగ్​తో వెలుగు దినపత్రిక లో కథనం పబ్లిష్​కాగా, అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. మండుతున్న ఎండలకు చెరువులో నీరు పూర్తిగా ఇంకి మధ్యలో చిన్న బురద గుంత మాత్రమే మిగిలింది. 

అందులో కొన్ని చేపలు చనిపోగా, వందల చేపలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని బాతులు కూడా చనిపోయాయి. దీంతో వీ6 వెలుగులో వార్త ప్రచురితంకాగా, బల్దియా అధికారులు స్పందించారు. సోమవారం కొన్ని డ్రమ్ముల్లో నీళ్లను నింపి బురదలో చనిపోయే స్థితిలో ఉన్న చేపలను పట్టుకొని అందులో వేశారు. మిగతా చేపలను బతికించడానికి చెరువులో 12 వేల లీటర్ల వాటర్​ట్యాంకర్​ను తెచ్చి నీళ్లను వదిలారు.   

ఇంకా వెయ్యి వరకు చేపలు 

సోమవారం 50 వరకు చేపలను పట్టుకుని డ్రమ్ముల్లో వేసి కాపాడగా, మరో వెయ్యి వరకు చిన్న పెద్ద చేపలు చెరువు బురదలో ప్రాణాలతో పోరాడుతున్నాయి. అన్నీ 3 నుంచి 5 కిలోల వరకు బరువు ఉన్నవేనని, సోమవారం పోసిన ఒక ట్యాంకర్​నీళ్లు ఒక్కరోజుకే సరిపోతాయని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. మరికొన్ని ట్యాంకర్లను చెరువులో నింపాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. 

అయితే, తమ దగ్గర అంత బడ్జెట్ లేదని, అందుకే, వాటర్ ట్యాంక్ లతో నీటి సరఫరా చేయలేకపోతున్నామని జీహెచ్ఎంసి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కష్టమైనా సోమవారం ఒక ట్యాంకర్​తో నీటిని తెచ్చి పోశామన్నారు. బోర్లు కూడా ఎండిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని, తమ వంతు ప్రయత్నంగా మిగిలిన చేపలను కాపాడే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.