హోలీ పండుగ నాడు పిడిగుద్దుల ఆట

హోలీ పండుగ నాడు పిడిగుద్దుల ఆట
  • రక్తాలు వచ్చేలా  కొట్టుకున్న గ్రామస్తులు 
  • వందేండ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం

బోధన్​, వెలుగు: వందేళ్ల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం నిజామాబాద్​జిల్లా బోధన్ మండలం హున్సాలో హోలీ సందర్భంగా గ్రామస్తులు పిడిగుద్దుల ఆట ఆడారు. ముందుగా గ్రామదేవతలకు పూజలు చేసి  గ్రామ పెద్దమనుషులైన పటేల్, పట్వారీలను డప్పులు బాజాలతో పిడిగుద్దుల ఆట ఆడే చోటికి తీసుకువచ్చారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి చావిడి వద్ద ఉన్న స్థలంలో రెండు వైపులా కట్టెల పాతారు. ఈ రెండు కట్టెలకు దొడ్డుతాడు కట్టి సుమారు 15  నుంచి -20 నిమిషాలు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కొట్టుకోవడంతో చాలామందికి ముఖం , చేతులు, వీపుపై గాయాలయ్యాయి. రక్తం కారినా లెక్క చేయకుండా అలాగే కొనసాగించారు. ఆట ముగిసిన తర్వాత గాయలైన చోట తెల్ల సున్నం రాశారు. కొట్టుకున్నోళ్లంతా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కుంటుతూ, మూలుగుతూ గ్రామంలోని గల్లీ గల్లీ తిరిగారు.  

గ్రామానికే అరిష్టమనే... 
ప్రతియేట హోలీ పండుగ రోజు పిడిగుద్దుల ఆట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టమని ఇలా చేస్తున్నారు. ఆటకు ముందు కుస్తీ పోటీలు కూడా నిర్వహించారు. వీటిని చూడడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారు, జిల్లా నుంచే కాకుండా, ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా తరలివచ్చారు.  ఎలాంటి సంఘటనలు జరగకుండా బోధన్​ రూరల్​ సీఐ రవీంద్రనాయక్​ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.