మత్తు ట్యాబ్లెట్లు అమ్ముతున్న ఐదుగురి అరెస్ట్

మత్తు ట్యాబ్లెట్లు అమ్ముతున్న ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్, వెలుగు : మత్తుకు బానిసై నైట్రావెట్ ట్యాబ్లెట్స్(సైకోట్రోపిక్ డ్రగ్) అమ్ముతున్న ఐదుగురిని టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.30  వేలు విలువ చేసే 1,464  నైట్రావెట్ ట్యాబ్లెట్స్ బాక్స్​లు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  సిటీ సీపీ సందీప్ శాండిల్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ్ (42) చాలా ఏండ్ల కిందట కుటుంబంతో కలిసి సిటీకి వచ్చాడు.  తన బంధువు కిషన్ విట్టల్ రావ్ కాంబ్లే  బిర్జుతగో కలసి నైట్రావెట్ ట్యాబ్లెట్స్ సేల్ చేస్తున్నాడు. గుల్బర్గాకు చెందిన సుప్రీత్ నవలే అనే వ్యక్తి నుంచి బిర్జు ఉపాధ్యాయ్ ఈ ట్యాబ్లెట్లు కొని వాటిని హైదరాబాద్​కు తరలిస్తున్నాడు. సిటీలోని డ్రగ్ పెడ్లర్లకు ఒక్కో బాక్స్​ను రూ. 5,500కు అమ్ముతున్నాడు.  బిర్జు ఉపాధ్యాయ్ తన భార్య, కుమారుడు, అత్త సహకారంతో  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు.  ఈ క్రమంలో  తన బంధువు రానుబాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్ ఇచ్చి కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు పంపాడు. 

ఈ టాబ్లెట్లను మంగార్ బస్తీలో ఉంటున్న రాజు, పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది.  సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. నిందితుడు  రానుభాయి కర్ణాటక నుంచి నైట్రావెట్ ట్యాబ్లెట్‌లను తీసుకుని ఎంజీబీఎస్‌లో బస్సు దిగినట్లు గుర్తించారు.  నైట్రావెట్ మాత్రలను మాంగర్ బస్తీ, హబీబ్‌నగర్​కు తీసుకెళ్తూ ఉండగా టీఎస్‌ న్యాబ్, అఫ్జల్‌గంజ్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు.  అనంతరం ఈ నెల 4 మంగార్ బస్తీలోని నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు కలిసి పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ, కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి.  నిందితుల ఇండ్లలో 11 బాక్స్​ల నైట్రావెట్ ట్యాబ్లెట్లు 22  సిరప్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.