- వ్యాపారిని బెదిరించి రూ.లక్ష డిమాండ్
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
షాద్‌నగర్, వెలుగు: రిపోర్టర్లమంటూ ఓ చిరు వ్యాపారిని బెదిరించి రూ.లక్ష డిమాండ్ చేసిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లను కొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కొత్తూరుకు చెందిన గ్యాస్ ఫిల్లింగ్ వ్యాపారి తస్లీమా వద్దకు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, నాగమల్లేశ్, వాణి, స్వప్న, కీర్తి వచ్చి తాము శుభోదయం, జేకే టీవీ రిపోర్టర్లమని చెప్పి బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో తస్లీమా పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు అక్కడికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు.
