ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష

ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష
  • మహిళకు భూ పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించడంపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. హెచ్చరికలతో సరిపెట్టకుండా ఏకంగా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల గడువిచ్చింది హైకోర్టు. గురువారం ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు సంచలనం సృష్టించింది.
నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు భూమి కోల్పోయినందుకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తనకు పరిహారం అందలేదంటూ బాధితురాలు మరోసారి కోర్టుకు అప్పీల్ చేసుకోగా విచారించిన హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలిచ్చినా భూ పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించుకున్న హైకోర్టు బాధ్యులైన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. అంతేకాదు పరిహారం మొత్తాన్ని ఐఏఎస్‌ అధికారుల జీతాలు, పెన్షన్ల నుంచి కట్‌ చేసి పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రిటైరైన ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌కు జైలు, నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. అలాగే అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబును కూడా బాధ్యుడుగా గుర్తించి రెండు వారాలు జైలు శిక్షతోపాటు  రూ.1000 జరిమానా విధించింది. అలాగే ఎస్‌.ఎస్‌.రావత్‌కు నెల రోజుల జైలు శిక్షతోపాటు  రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్షతోపాటు  రూ.1000 జరిమానా విధించింది. శిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించిన హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. అప్పటి వరకు జైలు శిక్షను సస్పెండ్‌ లో ఉంచాలని ఆదేశించింది.