ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి వరదల ఘటనలో..మరో ఐదుగురు అరెస్టు

ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి వరదల ఘటనలో..మరో ఐదుగురు అరెస్టు
  • దర్యాప్తునకు కమిటీ నియమించిన కేంద్రం 
  • మొత్తం 7కు చేరిన నిందితుల సంఖ్య.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు 
  • కోచింగ్ సెంటర్ల ఆక్రమణలపై బుల్డోజర్ యాక్షన్ షురూ
  • జూనియర్ ఇంజనీర్ పై వేటు.. అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెన్షన్ 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం సెల్లార్  లోకి వరదలతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్టయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. కోచింగ్  సెంటర్  ఓనర్, కోఆర్డినేటర్ ను ఇదివరకే అరెస్టు చేశారు. వరద నీరు బిల్డింగ్ బేస్ మెంట్లోకి వెళ్లేలా నిర్లక్ష్యంగా కారును  నడిపిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. అతని వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను పోలీసులు సోమవారం ఢిల్లీ తీస్  హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. 

వారిలో ఐదుగురిని (నలుగురు కోఓనర్లు, ఒక డ్రైవర్) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్  కస్టడీకి పంపింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు జూనియర్  ఇంజినీర్ ను ఢిల్లీ మునిసిపల్  కార్పొరేషన్(ఎంసీడీ) తొలగించింది. అసిస్టెంట్  ఇంజినీర్ ను సస్పెండ్ చేసింది. కాగా, వాన నీరు వెళ్లకుండా ఉన్న ఆక్రమణలపై ఎంసీడీ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది. ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని   తెలిపింది. 13 అక్రమ కోచింగ్  సెంటర్లను సీల్  చేశామన్నారు. కాగా, వరద వల్ల చనిపోయిన  డెల్విన్, శ్రేయ,  సోని మృతదేహాలను  కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
దుర్ఘటనపై దర్యాప్తునకు కమిటీ

రావూస్   స్టడీ సర్కిల్  దుర్ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సోమవారం ఒక కమిటీని నియమించింది. కమిటీలో హౌసింగ్ సెక్రటరీ,  హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్  సీపీ, ఫైర్  అడ్వైజర్, జాయింట్  సెక్రటరీ ఉన్నారు. ప్రమాదానికి  కారణాలు, భవిష్యత్తులో  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ 30 రోజుల్లోపు నివేదిక ఇవ్వనుంది. కాగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సివిల్స్  అభ్యర్థులు  కోచింగ్  సెంటర్  వద్ద ధర్నా కొనసాగించారు.  కాగా, ఆప్ ఆఫీసు ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  రాజీనామా చేయాలని  డిమాండ్  చేశారు. 

నరకం అనుభవిస్తున్నం.. సీజేఐకి సివిల్స్ అభ్యర్థి లేఖ

రావూస్  ఐఏఎస్  స్టడీ సెంటర్ దుర్ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు అవినాశ్ దూబే అనే సివిల్స్ అభ్యర్థి లేఖ రాశారు. ‘‘సర్.. ఢిల్లీలోని రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ లాంటి ఏరియాల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయి. వర్షాలు కురిసిన ప్రతీసారి వరదలు వస్తున్నాయి. మోకాలిలోతు నీళ్లలో నడుస్తున్నాం. కొన్నిసార్లు వరద నీరు ఇండ్లలోకి కూడా వస్తున్నది. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయారు. స్టడీ సర్కిల్ వాళ్లు రూల్స్ ఉల్లంఘించి సెల్లార్ లో లైబ్రరీ పెట్టారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మాలాంటి విద్యార్థులకు ఇక్కడ ఉండటం నరకంగా మారింది” అని అవినాశ్ తన లేఖలో పేర్కొన్నారు.