జూబ్లీహిల్స్ , వెలుగు: మధురానగర్ లోని శారదా చీరల దుకాణంలో కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు మహిళలు భారీ చోరీకి పాల్పడ్డారు. షాపింగ్ చేస్తున్నట్లు నటిస్తూ సుమారు రూ.45 వేల విలువైన 30 ప్యూర్ బనారస్ చీరలను ఎత్తుకెళ్లారు. గురువారం దుకాణానికి వచ్చిన ఈ మహిళలు రెండు బృందాలుగా విడిపోయారు. ఇద్దరేమో సిబ్బంది దృష్టి మరల్చగా, మరో ముగ్గురు చీరల కట్టను బయటకు తీసుకెళ్లి ఇన్నోవా క్రిస్టా కారులో పెట్టుకున్నారు.
కేవలం రూ.1,500 విలువ చేసే 3 చీరలు మాత్రం కొనుగోలు చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్టాక్ పరిశీలించిన సిబ్బంది చోరీని గుర్తించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని మహమ్మద్ ముస్థాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
