టికెట్లు తక్కువ అమ్మారంటూ కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ

టికెట్లు తక్కువ అమ్మారంటూ కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ
  • మేడ్చల్ డిపో ఆర్టీసీ అధికారుల నిర్వాకం
  • కార్మికులను కించపరచడంపై ప్రజాసంఘాల ఆగ్రహం  
  • బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
  • విమర్శలు రావడంతో ఫ్లెక్సీ తొలగించిన అధికారులు 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. బస్సుల్లో జనం ఎక్కకపోయినా, నష్టాలు వచ్చినా, సంస్థలో ఏది జరిగినా.. దానికి కేవలం కార్మికులనే బాధ్యులను చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా బుధవారం మేడ్చల్ డిపోలో టీఏవైఎల్ (ట్రావెల్ యాజ్ యూ లైక్-– డేపాస్​) టికెట్లు తక్కువ అమ్మారంటూ 15 మంది కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

ఆ కండక్టర్ల ఐడీ నంబర్లు, వాళ్లు మేలో అమ్మిన టికెట్ల సంఖ్యనూ అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను కించపరుస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. టీఏవైఎల్ టికెట్లు అమ్ముడుపోకపోతే కండక్టర్లను నిందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కార్మికులను ఇంత ఘోరంగా కించపరుస్తూ దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఆర్టీసీ నిర్వీర్యమవుతున్నది. నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం కరెక్టు కాదు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం” అని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ‘‘కార్మికులు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండి ఉంటే, రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా వాళ్ల పరువు తీస్తూ ఫ్లెక్సీ పెట్టడం కరెక్టు కాదు. ఇది ముమ్మాటికీ వేధింపుల కిందికే వస్తుంది. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ డిమాండ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు ఫ్లెక్సీని తొలగించారు. 

ఇది దారుణం..

ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారు. అధికారుల వేధింపులు తట్టుకోలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీఏవైఎల్ టికెట్లు అమ్మలేదంటూ కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ పెట్టడం దారుణం. అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. 
- హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ నేత